సుమారు పదేండ్ల పాలనలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ ఒక్క రంగంలోనూ తనదైన మార్కు చూపుతూ ప్రపంచం ముంగిట భారత్ సగర్వంగా నిలబడింది. దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ విషయంలో విఫలమై, మన భూభాగాలను పక్క దేశాలకు అప్పనంగా అందించిన చరిత్రను ఏ భారతీయుడు మరువలేడు. అలాంటి ఘటనలకు తావివ్వకుండా దేశ రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటూ మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పదేండ్లుగా మోదీ సాధించిన విజయాలు ఊరకే రాలేదు. సమర్థవంతమైన సైనిక శక్తికి తోడు, వారిని ఎల్లవేళలా కాచుకునే వ్యక్తే ప్రధానిగా ఉన్నారు కనుక.. ఆ విజయాలు సాధ్యమయ్యాయి.
పటిష్ట విధానం..
బలమైన నాయకుడు ప్రధానిగా ఉంటే దేశ భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో మన భారత్ ప్రత్యేక నిదర్శనమని చెప్పవచ్చు. కాంగ్రెస్ హయాంలో చీటికి మాటికి పాకిస్తాన్, చైనా యుద్ధానికి కాలుదువ్వేవి. టెర్రరిస్టు కార్యకలాపాలు యథావిధిగా సాగించేవి. కశ్మీర్ లో నిత్యం అలజడులు సృష్టించేవి. నిత్యం దేశంలో ఏదో ఒక చోట టెర్రరిస్టులు సాగేవి. 2014లో ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారినవి. మన దేశంపై దాడి చేయాలంటేనే శత్రు దేశాలు గజగజ వణికే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ లో చాలా మంది తాము ఇండియాలో పుట్టి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. భారత్ లోని ప్రశాంత వాతావరణాన్ని కొనియాడని ప్రపంచ పౌరుడు లేడు. మొన్నటికి మొన్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం సందర్భంగా మోదీ ప్రభుత్వం తన స్పష్టమైన విధానంతో ప్రపంచ దేశాల ఆదరణ చురగొన్నది. ‘‘ఇది యుద్ధాల కాలం కాదు’’ అని మన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థించని ప్రపంచ నాయకుడు లేడు. బయట ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజాస్వామానికి పెద్దన్న లాగా మన భారత్ వ్యవహరించడం.. అతి త్వరలోనే సూపర్ పవర్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సర్జికల్ స్ట్రైక్స్..
భారత్ తొలిసారి 2016లో సర్జికల్ దాడులు చేసింది. సెప్టెంబర్ 18న యూరీ ప్రాంతంలో టెర్రరిస్టులు భారత బలగాలపై దాడి చేశారు. సెప్టెంబర్ 29న యూరీ దాడికి ప్రతిగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు నిర్వహించింది. పుల్వామా ఆత్మహుతి దాడికి ప్రతీకార చర్యగా మరోసారి 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ పై సర్జికల్ దాడులు చేసింది. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి.
భారత్ తన పటిష్ట రక్షణ విధానాలతో దేశం లోపల, దేశం బయట శాంతి నెలకొల్పుతున్నది. ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో దేశంలో సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతున్నది. 2047 నాటికి భారత్ ప్రపంచ నంబర్ వన్ గా నిలుస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.




